Supreme Court: 'చట్టానికి అతీతులు కారు.. నేటి విచారణకు హాజరవ్వండి' అంటూ ఏపీ, బీహార్ సీఎస్ లకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court Issues Summons To AP and Bihar CS
  • ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆన్ లైన్ విచారణకు రావాలని ఆదేశం
  • కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై విచారణ
  • చాలా రాష్ట్రాల్లో అధికారిక లెక్కల కన్నా ఎక్కువ దరఖాస్తులు 
  • చాలామందికి పరిహారం అందకపోవడంపై సుప్రీం ఆగ్రహం  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీహార్ సీఎస్ లకు సుప్రీంకోర్టు ఇవాళ సమన్లను జారీ చేసింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఆదేశించింది. ‘‘వారేం చట్టానికి అతీతులు కారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా విచారణకు రమ్మనండి’’ అంటూ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులకు సంబంధించి సుప్రీంకోర్టు గత ఏడాది మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రూ.4 లక్షల పరిహారం చెల్లించాలంటూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ)ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దానికి గైడ్ లైన్స్ రూపొందించాలని సూచించింది.

దానిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. రూ.50 వేలు ఇస్తామంటూ దానికి గల కారణాలను వివరించింది. గత ఏడాది అక్టోబర్ లో సుప్రీంకోర్టు అందుకు అనుమతించింది. అయితే, ఇప్పటికీ చాలా మందికి పరిహారం అందించకపోవడం పట్ల దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ, బీహార్ సీఎస్ లకు సుప్రీంకోర్టు తాజా సమన్లను జారీ చేసింది.

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారానికి సంబంధించిన క్లెయిమ్ లు భారీగా వస్తున్నాయి. పరిహారానికి సంబంధించి రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెల్లడించిన డేటా ప్రకారం.. కరోనా మరణాల గణాంకాలతో పోలిస్తే పరిహారం దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి.
 
గుజరాత్ ప్రభుత్వం చెప్పిన మరణాల కన్నా క్లెయిమ్ అప్లికేషన్లు 9 రెట్లు ఎక్కువగా వచ్చాయి. తెలంగాణలో చూపిన మరణాల కన్నా 7 రెట్లు ఎక్కువ మంది క్లెయిమ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ విషయంలోనూ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చూపించిన మరణాల కన్నా రెండున్నర రెట్లు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో నమోదైన మరణాల కన్నా తక్కువ దరఖాస్తులు ఫైల్ అయ్యాయి.

గుజరాత్ లో కరోనా మృతుల సంఖ్య అధికారికంగా 10,094కాగా.. పరిహారం కోసం 89,633 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 68,370 క్లెయిమ్ లను అంగీకరించింది. 58,840 కుటుంబాలకు పరిహారం అందించింది. 4,234 దరఖాస్తులను తిరస్కరించింది.

అదే తెలంగాణ ప్రభుత్వం 3,993 మరణాలను అధికారికంగా ప్రకటిస్తే.. దానికి మించి 28,969 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటిదాకా 15,270 మంది దరఖాస్తులను ఆమోదించిన ప్రభుత్వం.. 12,148 కేసుల్లో మాత్రమే పరిహారం చెల్లించింది. మహారాష్ట్రలో 1.41 లక్షల మరణాలకుగానూ 2.13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏపీలో అధికారిక లెక్కల ప్రకారం 14,471 మంది కరోనాతో చనిపోగా.. 36,205 మంది పరిహారం కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పటిదాకా 11,464 మందికి పరిహారం ఇచ్చారు.
Supreme Court
Andhra Pradesh
Telangana
COVID19
Deaths
Compensation

More Telugu News