Tollywood: ప్రేమ నిజం కాదు.. అది జస్ట్ కెమికల్ రియాక్షన్: పూరీ జగన్నాథ్
- పూరీ మ్యూజింగ్స్ లో కెమికల్ రియాక్షన్స్ పై వివరణ
- ప్రతి ఫీలింగ్ కెమికల్ రియాక్షన్ వల్లే వస్తుంది
- ప్రతి ఫీలింగ్ కూ దేవుడికి మొక్కేయడమేనా?
- అది మాయ అని తెలుసు కాబట్టే దేవుడు వరాలివ్వడు
- ప్రతి కెమికల్ రియాక్షన్ కూ వరాలివ్వడానికి ఆయనేం పిచ్చోడు కాదు
ప్రేమ అంటే నిజమైన ఫీలింగ్ కాదని, అది జస్ట్ కెమికల్ రియాక్షన్ మాత్రమేనని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. పూరీ మ్యూజింగ్స్ లో కెమికల్ రియాక్షన్స్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. మనలో పుట్టే ప్రతి అనుభూతి కెమికల్ రియాక్షన్ వల్లే కలుగుతుందన్నారు. మెదడు నుంచి విడుదలయ్యే హార్మోన్లే అందుకు కారణమన్నారు.
‘‘సడన్ గా ఓ రోజు ప్రేమించడం మొదలుపెడతాం. ప్రేమించిన వాళ్లకు ఐ లవ్ యూ చెప్పేస్తాం. విరహ గీతాలు పాడుకుంటాం. ఇంట్లో వాళ్లు అడ్డుకుంటారు. చేతులు కోసుకుంటాం. ఇంట్లో నుంచి వెళ్లిపోతాం. ఇక చేసేది లేక పెద్దవాళ్లు పెళ్లి చేసేస్తారు. మీ ఇద్దరే మిగిలిపోతారు. అదే సీన్ నంబర్ వన్. ఆ తర్వాత ఇద్దరి సరదా తీరిపోతుంది. ప్రేమ అనే ఫీలింగ్ నిజం కాదు. కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చే యుఫోరియానే ప్రేమ అనుకుంటాం’’ అని చెప్పుకొచ్చారు.
మనం నిద్రపోవడానికి లేదా కుంగిపోవడానికి సెరటోనిన్ అనే హార్మోన్ కారణమని, డోపమైన్ ను ప్లెజర్ కెమికల్ అని పిలుస్తారని వివరించారు. ప్రేమ కూడా అలాంటిదేనన్నారు. కేవలం లైంగిక ఆకర్షణ వల్ల పుట్టేదే ప్రేమ అన్నారు. మనకు బాధవచ్చినా, సంతోషం వచ్చినా దేవుడికి మొక్కేస్తుంటామని, ఇకపై అలా చేయొద్దని పూరీ సూచించారు. ఏ ఫీలింగ్ వచ్చినా దేవుడిని పిలిచేయడమేనా? అని అన్నారు. మనకు కలిగే ఫీలింగ్ అంతా మాయ అని దేవుడికి తెలుసు కాబట్టే దేవుడు మనం ఏ కోరుకున్నా స్పందించడన్నారు. 'ప్రతీ కెమికల్ రియాక్షన్ కూ వరాలు ఇచ్చుకుంటూ వెళ్లడానికి ఆయనేం పిచ్చోడు కాదు.. దేవుడు' అంటూ పూరీ చెప్పారు.