Andhra Pradesh: ఆదాయం భారీగా పడిపోయింది.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు: ఉద్యోగులకు ఏపీ సీఎస్ హితవు

There will not be reduction in gross salary says AP CS

  • ఏపీలో కొలిక్కి రాని పీఆర్సీ అంశం
  • ఆందోళనలకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
  • గ్రాస్ శాలరీలో తగ్గుదల ఉండదన్న సీఎస్

పీఆర్సీ అంశం ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అగాధాన్ని పెంచుతోంది. తమను మోసం చేశారంటూ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లను ముట్టడించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవని అన్నారు. ఐఆర్ అనేది జీతంలో భాగం కాదని చెప్పారు. కరోనా కష్ట కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని తెలిపారు. కోవిడ్ వల్ల ఆదాయం భారీగా పడిపోయిందని... ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఉద్యోగులకు రూ. 17 వేల కోట్ల మేర మధ్యంతర భృతి ఇచ్చామని సీఎస్ తెలిపారు. ఉద్యోగి గ్రాస్ శాలరీలో తగ్గుదల ఉండదని, అయితే శాలరీ కాంపొనెంట్ లో కొన్ని తగ్గొచ్చు, కొన్ని పెరగొచ్చని చెప్పారు. పదేళ్ల క్రితమే తాను పీఆర్సీని అధ్యయనం చేశానని... 2008-09లో పీఆర్సీ ప్రక్రియలో పాల్గొన్నానని తెలిపారు.

అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని... పీఆర్సీ ఆలస్యం అయినందువల్ల మధ్యంతర భృతి చెల్లించామని చెప్పారు. 2019 నుంచి లెక్కించి డీఏల చెల్లింపును ప్రకటించామని తెలిపారు. వేతనం ఎలా ఉందో చూడాలే తప్ప, అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.

రాష్ట్రానికి కరోనా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తెచ్చి పెట్టిందని సీఎస్ అన్నారు. వాస్తవానికి 98 వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం వల్ల యువతకు ఉద్యోగాలు తగ్గుతాయనే వాదనలో నిజం లేదని తెలిపారు. ఉద్యోగ నియామకాలు ఉండవన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.

సమీర్ శర్మ రెకమెండేషన్లను పక్కన పెట్టలేదని, అవి కేవలం రెకమెండేషన్లు మాత్రమేనని... వాటిని అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చని అన్నారు. కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ తండ్రినే అంటారని... అదే విధంగా బాధతో ఉద్యోగులు అన్న మాటలను తాను భరిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News