Andhra Pradesh: ఇక మాటలు, చర్చలు లేవు.. ఎల్లుండి సమ్మె నోటీసు ఇస్తున్నాం: ఏపీ ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

AP employees are going for strike

  • పీఆర్సీపై సీఎం జగన్ ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారు
  • పీఆర్సీ వల్ల జీతాలు పెరగాలే కానీ తగ్గవు
  • ఆర్థికలోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది

ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ గొడవ కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడే అవకాశమే తమకు రాలేదని చెప్పారు. పీఆర్సీపై సీఎం ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఒప్పందం లేదని, తాము ఎక్కడా సంతకాలు పెట్టలేదని చెప్పారు. పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగాలే కానీ, తగ్గవని అన్నారు. తమను ఇంత మోసం చేస్తారా? అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ స్కేల్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం పేరుతో ఉద్యోగులను సంక్షోభంలోకి నెడతారా? అని అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇవ్వాల్సినప్పుడల్లా ప్రభుత్వాలు ఆదాయం లేవనే చెపుతాయని... రాష్ట్ర విభజన వల్ల ఆర్థికలోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారని... మరి, ఆయన అబద్ధాలు చెప్పారని అనుకోవాలా? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంతకుముందు విజయసాయిరెడ్డి రెడ్డి చేసిన ట్వీట్ ను చూపించారు. ఇకపై మాటలు, చర్చలు ఉండవని... ఈనెల 21 సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News