N95 mask: అన్నింటిలోకి ఎన్ 95 మాస్క్ ఎందుకు సురక్షితం?
- ఫైబర్ లేయర్లతో ఉంటుంది
- వైరస్ అతుక్కుపోతుంది కానీ ప్రయాణించలేదు
- ముఖానికి గట్టిగా ఫిక్స్ అయి కూర్చుంటుంది
- గుడ్డ మాస్క్ తో ఖాళీలు ఉంటాయ్
చాలా మంది గుడ్డతో చేసిన ఫేస్ మార్క్ ధరిస్తున్నారు. కానీ ఒమిక్రాన్ వైరస్ కు వేగంగా విస్తరించే గుణం ఉంది. ఈ వైరస్ తమకు సోకకూడదని కోరుకునే వారు ఎన్ 95 మాస్క్, లేదంటే కేఎన్ 95 మాస్క్ లనే ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకపక్క, కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా, బహిరంగ ప్రదేశాల్లో జన సంచారం తగ్గడం లేదు. మాల్స్ నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే అంగళ్ల వరకు ప్రతి చోటా ప్రజలు పెద్ద సమూహాలుగా కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ప్రదేశాల్లో పటిష్ఠమైన మాస్క్ లతోనే రక్షణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇటీవలే తన మార్గదర్శకాలను సవరించింది. ముఖానికి సరిగ్గా ఫిక్స్ అయ్యే మాస్క్ నే ధరించాలని సూచించింది. గతంలో సరఫరా తక్కువగా ఉన్న సమయంలో ఎన్95 మాస్క్ లను వైద్య సిబ్బంది కోసం రిజర్వ్ చేయాలని సీడీసీ సూచించడం గమనార్హం. అంటే వీటితో మెరుగైన రక్షణ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
గుడ్డ మాస్క్ తో పోలిస్తే ఎన్95 మాస్క్ ఎక్కువ లేయర్లతో పటిష్ఠంగా ఉంటుంది. ముఖానికి చక్కగా ఫిక్స్ అయిపోతుంది. లూజ్ గా, సందులతో ఉండదు. 95 శాతం హానికారక వైరస్ నుంచి రక్షణ కల్పించే విధంగా దీన్ని తయారు చేశారు. ఎన్ 95 మాస్క్ ల్లోని ఫైబర్ లేయర్ల నుంచి వైరస్ ప్రయాణం చేయలేదు. బయటి భాగంలో ఉండిపోతుంది. ఎన్95, కేఎన్95, డబ్ల్యూ 95 పేరుతో లభిస్తున్న వాటిలో అత్యధికం నకిలీవని నిపుణులు చెబుతున్నారు. కనుక మంచి నాణ్యమైన మాస్క్ కొనుగోలు చేసుకోవాలి.