COVID19: రోజువారీ కేసులు 3 లక్షలు దాటేశాయ్.. 24 గంటల్లోనే భారీగా నమోదైన కరోనా కేసులు

India Sees Highest Cases Since 249 days Tally Crosses 3 Lakh
  • 3,17,532 మందికి పాజిటివ్
  • పాజిటివిటీ రేటు 16.41 శాతంగా నమోదు
  • ఒక్కరోజులోనే 491 మంది మృతి
  • దేశంలో ఇంకా 19,24,051 యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసులు 3 లక్షల మార్కును దాటేశాయి. నిన్న ఒక్కరోజే 3,17,532 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇది 249 రోజుల గరిష్ఠం కావడం గమనార్హం. 19,35,180 టెస్టులు చేయగా.. పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే పాజిటివిటీ రేటు ఒక శాతం పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.06 శాతంగా నమోదైంది.

 ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనాతో మరో 491 మంది మరణించారు. నిన్న 2,23,990 మంది కోలుకోగా.. మొత్తం 3,58,07,029 మంది రికవర్ అయ్యారు. రికవరీ రేటు 93.69 శాతం. ఒమిక్రాన్ కేసులు 9,287కి పెరిగాయి.


ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే, ఇప్పటివరకు 159,67,55,879 డోసుల టీకాలను వేశారు. నిన్నటివరకు 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న 3.8 కోట్ల మంది టీనేజర్లకు టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 73 లక్షల డోసుల టీకాలను జనానికి వేసినట్టు తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 61 లక్షల డోసుల ప్రికాషనరీ టీకాలను ఇచ్చామని వెల్లడించింది. రాష్ట్రాలకు 158,96,34,485 డోసుల టీకాలను ఇవ్వగా.. ఇంకా రాష్ట్రాల వద్ద 12,72,19,636 డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
COVID19
Omicron
Covid Vaccine

More Telugu News