Andhra Pradesh: కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు.. అన్ని ట్రెజరీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

AP Govt Orders All Treasuries To Implement New PRC Rules
  • జీతాల్లో మార్పులు చేయాలని ఉత్తర్వులు
  • కొత్త సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేస్తున్న సీఎఫ్ఎంఎస్
  • ఆందోళనలను ఉద్ధృతం చేయనున్న ఉద్యోగులు
  • రేపు సీఎస్ ను కలిసి సమ్మె నోటీసులిచ్చే అవకాశం
పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగులు, టీచర్లు డిమాండ్ చేస్తున్నా, వారు ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ప్రకారమే వేతనాలను చెల్లించేలా అన్ని ట్రెజరీ ఆఫీసులకు ప్రభుత్వం ఉత్తర్వులను పంపించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగానే జీతాల్లో మార్పులను చేయాలని ఆదేశాలిచ్చింది. ఇటు జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ కొత్త సాఫ్ట్ వేర్ నూ సిద్ధం చేసి పెట్టింది.

అయితే, జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ఇవాళ ఇప్పటికే ఉపాధ్యాయులు కలెక్టరేట్లను ముట్టడించారు. చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఉద్యోగులు కూడా ఆందోళనలను ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న వారు.. రేపు సీఎస్ సమీర్ శర్మను కలిసి ముందస్తు సమ్మె నోటీసును ఇవ్వనున్నారు.

నిబంధనల ప్రకారం 14 రోజుల ముందే సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి ఐక్యవేదికలు ఇవాళ నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నాయి.
Andhra Pradesh
PRC
Treasury
Employees

More Telugu News