Sandalwood: కన్నడ డైరెక్టర్ ను బలి తీసుకున్న కరోనా.. సుదీప్ ‘కిచ్చ’, యశ్ ‘కిరాతక’ చిత్రాల దర్శకుడి మృతి

Kannada Director Pradeep Raj Succumbed To Covid

  • ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన ప్రదీప్ రాజ్
  • పదిహేనేళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న డైరెక్టర్
  • పుదుచ్చేరిలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్న సోదరుడు

మరో సినీ ప్రముఖుడిని కరోనా బలి తీసుకుంది. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నటించిన ‘కిచ్చ’, కేజీఎఫ్ ఫేమ్ యశ్ నటించిన ‘కిరాతక’లను రూపొందించిన దర్శకుడు ప్రదీప్ రాజ్ మహమ్మారి బారిన పడి ఇవాళ మరణించారు. ఆయన వయసు 46 సంవత్సరాలు.

కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన ఆయన.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పదిహేనేళ్లుగా ఆయన మధుమేహంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారు జామున 3 గంటలకు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పుదుచ్చేరిలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు ప్రశాంత్ రాజ్ తెలిపారు.

కాగా, ఆయన మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, పలువురు నెటిజన్లు సంతాపాలు తెలియజేశారు. ట్విట్టర్ లో ఆయన సినిమాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. 'కిరాతక' సెట్ లో హీరో యశ్, హీరోయిన్ ఓవియాతో దిగిన ఫొటోను పెట్టి నివాళులర్పిస్తున్నారు.

కిచ్చ, కిరాతకతో పాటు రజనీకాంత, అంజాద గండు, మిస్టర్ 420 వంటి సినిమాలనూ ప్రదీప్ రాజ్ తెరకెక్కించారు. రజనీకాంతకు ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశారు. ఈ ఏడాదే ‘కిరాతక 2’ సినిమానూ విడుదల చేసేందుకు ఆయన సన్నాహకాలూ మొదలుపెట్టారు. ఇంతలోనే ఆయన మరణించారు.

  • Loading...

More Telugu News