Perni Nani: ఉద్యోగులను యూనియన్ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారు: పేర్ని నాని ఆగ్రహం
- ఐఆర్ కింద రూ. 17,918 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా?
- పీఆర్సీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి
పీఆర్సీ వ్యవహారంలో ఏపీ ఉద్యోగులు పోరాట బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ వారు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను యూనియన్ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ 27 శాతం ఐఆర్ ఇవ్వలేదని... ఐఆర్ కింద రూ. 17,918 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఐఆర్ ను జీతంలో భాగంగా ఎలా పరిగణిస్తారని అడిగారు.
పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జీతం పెరిగిందా? లేదా? అనే విషయాన్ని మాత్రమే చూడాలని అన్నారు. ఉద్యోగులు ఆశించినంత మేరకు చేయలేదనే బాధ తమకు కూడా ఉందని... గత్యంతరం లేని పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని... ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అన్నారు. ఎవరో చెప్పిన మాటలు వినొద్దని కోరారు. 23 శాతం ఫిట్ మెంట్ ను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామని... ఉద్యోగులపై ప్రేమ లేకనే సీఎం జగన్ ఇవన్నీ చేస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు.