Statue Of Equality: ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా 'సమతా మూర్తి' విగ్రహం ఆవిష్కరణ.. వెల్లడించిన చిన జీయర్ స్వామి

Modi To Inaugurate Statue Of Equality Says China Jeeyar

  • ఫిబ్రవరి 13న విగ్రహం లోపలి గర్భాలయం  ప్రారంభం
  • ఆవిష్కరించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
  • మరో వెయ్యేళ్లపాటు జనానికి ఆయన బోధనలను చెప్పేందుకే ఈ ప్రాజెక్టు అన్న చినజీయర్ స్వామి

సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామానుజాచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తి లోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు చినజీయర్ స్వామి ఆశ్రమం ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్ ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతా మూర్తిని ఏర్పాటు చేయనున్నారు.

‘‘సమతా మూర్తి ఆవిష్కరణకు అన్ని వర్గాల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులు, ముఖ్యమైన వ్యక్తులు, భక్తులు, ప్రజలంతా వచ్చి సమతా మూర్తి ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమానత్వానికి రామానుజాచార్యుల వారు వెయ్యేళ్ల పాటు ప్రతీకగా నిలిచారు. ఆయన బోధనలను మరో వెయ్యేళ్ల పాటు జనాలకు తెలియజెప్పేందుకే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశాం’’ అని చినజీయర్ స్వామి తెలిపారు.

కాగా, కూర్చుని ఉన్న పొజిషన్ లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహంగా సమతా మూర్తి రికార్డుల్లోకి ఎక్కనుంది. కూర్చుని ఉన్న పొజిషన్ లో అతిపెద్ద విగ్రహంగా థాయ్ లాండ్ లోని బుద్ధుడి విగ్రహం పేరిట రికార్డుంది.

రామానుజాచార్యుల విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, కంచు, జింక్ వంటి పంచలోహాలతో రూపొందించారు. విగ్రహం లోపల గర్భాలయాన్ని 120 కిలోల బంగారంతో నిర్మించారు. భూమిపై ఆయన 120 ఏళ్లు నడయాడినందుకు గుర్తుగా 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ప్రాజెక్టు కోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలు, చందాలతో దానిని నిర్మిస్తున్నారు. 108 దివ్యదేశాలు, 108 విష్ణు ఆలయాల ప్రతిరూపాలను ఇందులో నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News