Bonda Uma: గుడివాడలో ఉద్రిక్తత... టీడీపీ నేత బోండా ఉమ కారుపై రాళ్ల దాడి
- కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించారంటూ వార్తలు
- నిజ నిర్ధారణ కోసం గుడివాడ వెళ్లిన టీడీపీ నేతలు
- టీడీపీ కార్యాలయంపై రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులు
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నిర్వహించారంటూ వస్తున్న వార్తలు రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. అంతేకాదు టీడీపీ నేత బోండా ఉమ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.