Mahesh Babu: కేబీఆర్ పార్కు వద్ద పాము కనిపించింది... మళ్లీ అటువైపు వెళ్లలేదు: బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ షో'లో మహేశ్ బాబు

Mahesh Babu attends Balakrishna Unstoppable Talk Show
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
  • సీజన్ చివరి ఎపిసోడ్ కు మహేశ్ బాబు రాక
  • ఆసక్తికర ప్రశ్నలు అడిగిన బాలయ్య
  • సరదాగా సమాధానాలు చెప్పిన మహేశ్ బాబు
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహించే అన్ స్టాపబుల్ టాక్ షోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు కొంటె ప్రశ్నలకు మహేశ్ కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చారు. "అసలు మహేశ్ ఎవరు?" అంటూ బాలయ్య ప్రశ్నించగా, "నా పిల్లలకు తండ్రిగా ఉండే మహేశ్" అంటూ మహేశ్ బాబు సమాధానమిచ్చారు. ఇంట్లో సితార అల్లరి అంతాఇంతా కాదని, తాట తీసేస్తుందని అన్నారు. తండ్రి కృష్ణ మాదిరే తాను కూడా సెటైర్లు వేస్తుంటానని వెల్లడించారు.

ఇక నమ్రత గురించి మాట్లాడుతుండగా, 'ఇప్పుడెందుకండీ, నేను మళ్లీ ఇంటికి వెళ్లాలి' అని మహేశ్ బాబు చమత్కరించారు. ఇక ఓ ఆసక్తికర సంఘటన గురించి చెబుతూ, గతంలో ఓసారి హైదరాబాదు కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్ కు వెళ్లానని, అయితే ఒక చోట పాము కనిపించిందని, దాంతో రివర్స్ లో ఐదు కిలోమీటర్లు వచ్చేశానని, మళ్లీ కేబీఆర్ పార్కుకు వెళ్లలేదని మహేశ్ బాబు వివరించారు.

అటు, మహేశ్ బాబు ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా వందలాది చిన్నారులకు ఉచితంగా హృదయ సంబంధ ఆపరేషన్లు చేయిస్తున్న వైనాన్ని బాలయ్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహేశ్ బాబు ద్వారా సాయం అందుకున్న పలువురు చిన్నారుల తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. వారు మహేశ్ ను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా మహేశ్ బాబు ఎంతో వినమ్రంగా స్పందించారు. తనలాంటి వాళ్లకు డబ్బు ఉంది కాబట్టి చికిత్స చేయించుకోగలమని, లేనివాళ్లకు ఎవరు చేయిస్తారన్న ఆలోచన రావడంతో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాగా, ఈ సీజన్ కు అన్ స్టాపబుల్ లో ఇదే చివరి ఎపిసోడ్. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది.
Mahesh Babu
Unstoppable
Talk Show
Balakrishna
Aha OTT
Tollywood

More Telugu News