Team India: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి... సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం
- పార్ల్ లో రెండో వన్డే
- తొలుత బ్యాటింగ్ చేసిన భారత్
- సఫారీల ముందు 288 రన్స్ టార్గెట్
- 3 వికెట్లకు ఛేదించిన ఆతిథ్య జట్టు
- 2-0తో సిరీస్ విజేతగా దక్షిణాఫ్రికా
- ఈ నెల 23న చివరి వన్డే
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ కు ఏదీ కలిసి రావడంలేదు. ఇప్పటికే టెస్టు సిరీస్ లో ఓటమిపాలైన టీమిండియా, వన్డే సిరీస్ లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంది. పార్ల్ లో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. భారత్ విసిరిన 288 పరుగుల విజయలక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి ఛేదించింది.
ఓపెనర్లు జేన్ మన్ మలాన్ 91, క్వింటన్ డికాక్ 78 పరుగులు చేసి తొలి వికెట్ కు 132 పరుగులు జోడించారు. ఓపెనింగ్ జోడీ వేసిన పునాదిపై కెప్టెన్ టెంబా బవుమా (35), ఐడెన్ మార్ క్రమ్ (37 నాటౌట్), రాస్సీ వాన్ డర్ డసెన్ (37 నాటౌట్) తమ వంతు కృషి చేశారు. దాంతో ఆ జట్టు 48.1 ఓవర్లలో గెలుపు తీరాలకు చేరింది.
భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. తొలి వన్డేలోనూ గెలిచిన సఫారీలు తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 23న కేప్ టౌన్ లో జరగనుంది. సిరీస్ ఫలితం తేలడంతో మూడో వన్డే నామమాత్రంగా మారింది.