Virat Kohli: కోహ్లీ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. ద్రవిడ్, కపిల్‌ను వెనక్కి నెట్టేసిన మాజీ స్కిప్పర్
- వన్డేల్లో వరుసగా 14వ సారి డకౌట్
- వరుసగా 64వ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ ముఖం చూడని ‘రన్ మెషీన్’
- అత్యధిక సార్లు డకౌట్ అయిన జాబితాలో సచిన్‌దే అగ్రస్థానం
ఫామ్ కోసం గత కొంతకాలంగా తంటాలు పడుతున్న టీమిండియా ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో నిన్న పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.
వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇది 14వ సారి. అంతేకాదు, వన్డేల్లో ఓ స్పిన్నర్ (కేశవ్ మహారాజ్) బౌలింగులో డకౌట్ కావడం కోహ్లీకి ఇదే తొలిసారి. ఈ ఔట్‌తో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్, కపిల్‌దేవ్ చెత్త రికార్డును కోహ్లీ అధిగమించాడు.
వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు అగ్రస్థానంలో ఉంది. సచిన్ 20 సార్లు డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జవగళ్ శ్రీనాథ్ (20), అనిల్ కుంబ్లే (18), యువరాజ్ సింగ్ (18), హర్భజన్ సింగ్ (17), సౌరవ్ గంగూలీ (16), జహీర్ ఖాన్ (14), కోహ్లీ (14), సురేశ్ రైనా (14), వీరేంద్ర సెహ్వాగ్ (14), రాహుల్ ద్రవిడ్ (13), కపిల్ దేవ్ (13) ఉన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా సెంచరీల ముఖం చూడని కోహ్లీ.. వరుసగా 64వ ఇన్నింగ్స్‌లోనూ శతకం లేకుండానే పెవిలియన్ చేరాడు. అంతేకాదు, ఈ కాలంలో డకౌట్ కావడం ఇది ఏడోసారి. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఫలితంగా అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలగినట్టు అయింది.
సఫారీలతో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ తిరిగి గాడినపడినట్టేనని అభిమానులు భావించారు. అయితే, నిన్నటి రెండో వన్డేలో మాత్రం పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగి అభిమానులను ఉసూరుమనిపించాడు.