Supreme Court: కలల ఫ్లాట్ చూపించి ఉత్తుత్తి ఫ్లాట్ అంటగడతానంటే కుదరదు: సుప్రీంకోర్టు
- హామీ మేరకు వసతులు సమకూర్చాలి
- లేదంటే పెట్టుబడి వెనక్కి ఇచ్చేయాల్సిందే
- వడ్డీ కూడా చెల్లించాలి
- కొనుగోలుదారులకు అనుకూలంగా తీర్పు
ముందు డ్రీమ్ ఫ్లాట్ (అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దిన నమూనా ఫ్లాట్) చూపించి.. కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు బిల్డర్లు. తీరా చివర్లో అప్పగించే ఫ్లాట్ ముందు చూపించిన దాని మాదిరిగా ఉండదు. అదేంటని నిలదీశారనుకోండి.. అందుకు అదనపు ఖర్చు అవుతుందని, అది భరించేట్టు అయితే ఆ నమూనాలో ఇవ్వడం సాధ్యపడుతుందని చెబుతారు. అదే విషయం ముందు చెబితే అమ్ముడుపోవని అలాంటి ట్రిక్స్ పాటిస్తుంటారు.
ఇటువంటి ఒక కేసులో బిల్డర్ కు సుప్రీంకోర్టు తలంటింది. కలల (డ్రీమ్) ఫ్లాట్ చూపించి వసూలు చేసిన మొత్తాన్ని కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గురుగ్రామ్ లో నిర్మాణ సంస్థ ఐరియో ప్రైవేటు లిమిటెడ్ ‘స్కైఆన్’ ప్రాజెక్టు చేపట్టింది. నమూనా ఫ్లాట్ లో ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్ చూపించింది. ఫ్లాట్ నుంచి చూస్తే గోల్ఫ్ కోర్సు కనిపిస్తుందని (గోల్ఫ్ కోర్స్ వ్యూ) బ్రోచర్ రూపొందించింది. దీన్ని చూసి కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ.2 కోట్లకు పైనే వసూలు చేసింది.
కానీ, చివరికి హామీ ఇచ్చిన వసతుల్లో కొన్నే ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు కొందరు తమ పెట్టుబడి మొత్తాన్ని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. 20 శాతం మినహాయించుకుని ఇస్తామని ఐరియో సంస్థ తెలిపింది. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను కొనుగోలుదారులు ఆశ్రయించారు. అసలు పెట్టుబడిని, తీసుకున్న నాటి నుంచి 10.5 శాతం వడ్డీని రెరా చట్టం కింద చెల్లించాలని ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
‘‘కలల ఫ్లాట్ చూపించి, హామీ మేరకు వసతులను సమకూర్చలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు కొనుగోలు దారులు తమ పెట్టుబడిని, వడ్డీ సహా తిరిగి పొందేందుకు అర్హులు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.