Congress: చర్చించి దండగ అని వదిలేశాం.. కాంగ్రెస్ కు పీకే దూరమవడంపై ప్రియాంక గాంధీ

Yes At Some Point He Had To Join Congress But Did Not Work Says Priyanka Gandhi
  • ఆయన వెళ్లిపోవడానికి చాలా కారణాలున్నాయని కామెంట్
  • కొంత ఆయన.. కొంత మేమూ కారణమే
  • యూపీ సీఎం అభ్యర్థి నేనే అని జోక్ చేశా
  • ప్రతీసారి అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు?
వాస్తవానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సివుందనీ, కానీ, అది ఫలించలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆయన పార్టీకి దూరమవడానికి ఎన్నో కారణాలున్నాయని చెప్పారు.

‘‘ఆయన పార్టీకి దూరమవడానికి కొంత ఆయన కారణం.. కొంత మేమూ కారణం. ఆ కారణాలేంటన్నది ఇప్పుడు నేను చెప్పలేను. చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదర్లేదు. వాటి మీద చర్చించి దండగని ఇక వదిలేశాం’’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. బయటి వ్యక్తిని తీసుకుంటుండడంపై పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైందన్న వాదనలను కొట్టిపారేశారు.  

ఇక, తానే యూపీ సీఎం అభ్యర్థినంటూ హింట్ ఇచ్చిన వ్యాఖ్యలపైనా ఆమె వివరణ ఇచ్చారు. తానేదో ‘అనుకోకుండా జోక్ చేశా’నని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతిసారీ అదే ప్రశ్న అడుగుతుంటే ఏం చెప్పమంటారంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేనే కాంగ్రెస్ యూపీ ప్రధాన కార్యదర్శిని. ఆయనే సీఎం క్యాండిడేట్.. ఈమే మా అభ్యర్థి అని చెప్పాలా? అది జరగని పని’’ అని ఆమె స్పష్టం చేశారు.

ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని అడిగితే ‘‘నా మొహాన్ని అన్ని చోట్లా చూస్తుంటారు. కాదంటారా?’’ అని ఆమె బదులిచ్చారు. బహుశా పోటీ చేస్తానేమోనంటూ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. తాను పోటీ చేసేదీ లేనిదీ టైం వచ్చినప్పుడు చెబుతానన్నారు. తానే యూపీ సీఎం అభ్యర్థినని అనుకోవడం సరికాదని చెప్పారు. తాను యూపీకి పార్టీ జనరల్ సెక్రటరీనని, కాబట్టి యూపీ బాధ్యత మొత్తం తనదేనని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంచితే, గత ఏడాది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పీకే అనేకమార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హఠాత్తుగా ఆయన కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. ఒకే వ్యక్తి కాంగ్రెస్ ను ఏలడం వారి జన్మహక్కు కాదంటూ ఓసారి కామెంట్ చేశారు. కాగా, 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పీకే వ్యూహకర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పలేదు.
Congress
Priyanka Gandhi
Prashant Kishor
PK
Uttar Pradesh

More Telugu News