India: 'జట్టుకి అశ్విన్ అవసరం లేదు'.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి వేళ సంజయ్ మంజ్రేకర్ వాఖ్యలు
- దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం నుంచి చెబుతున్నా
- అశ్విన్ ఎలాంటి ప్రత్యేక కారణమూ లేకుండా తిరిగి వచ్చాడు
- వన్డేల్లోకి వస్తానని అశ్విన్ కూడా ఊహించలేదు
- సెలెక్టర్లు మాత్రం ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావట్లేదు
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వన్డే సిరీస్‌ను కోల్పోవడంతో టీమిండియా బౌలర్లపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలు తెలిపారు. వన్డే వంటి పరిమిత ఓవర్ల జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్ ఎలాంటి ప్రత్యేక కారణమూ లేకుండా తిరిగి వచ్చాడని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాకు అశ్విన్ వంటి స్పిన్నర్ అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్ని తాను దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం నుంచి చెబుతున్నానని అన్నారు. వన్డేల్లోకి వస్తానని అశ్విన్ కూడా ఊహించలేదని, సెలెక్టర్లు మాత్రం అతడిని ఎందుకు ఎంపిక చేశారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.
మ్యాచ్ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టే స్పిన్నర్లు భారత్‌కు కావాలని ఆయన చెప్పారు. అశ్విన్ మాత్రమే కాకుండా స్పిన్నర్‌గా చాహల్ కూడా అంతగా రాణించలేకపోతున్నాడని మంజ్రేకర్ అన్నారు. కుల్దీప్ యాదవ్ సేవలను టీమిండియా కచ్చితంగా కోల్పోతోందని, అతడికి మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టే సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.