COVID19: కరోనాకు సైడ్ ఎఫెక్ట్స్ లేని రెండు ఔషధాలు.. సీడీఆర్ఐ అభివృద్ధి చేస్తున్న ఆ ఔషధాలివే!
- ఉమిఫెనోవిర్ తో కలిపి రెండు మందులు
- ఉమిఫెనోవిర్–మోల్నుపిరవిర్ కాంబినేషన్ లో ట్రీట్మెంట్
- నిక్లోసజమైడ్ తో కలిపి మరో కాంబినేషన్
- సైడ్ ఎఫెక్ట్స్ ను ఉమిఫెనోవిర్ చాలా వరకు తగ్గిస్తుందన్న శాస్త్రవేత్తలు
కరోనా చికిత్సకు రెండు కొత్త ఔషధాలపై లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీడీఆర్ఐ) పరిశోధన చేస్తోంది. ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుండా ఉండే మందులను పేషెంట్లకు ఇవ్వడంపై దృష్టి సారించింది. కరోనా పేషెంట్లకు సురక్షితమైన ఔషధ కాంబినేషన్ ను ఇవ్వడంపై చీఫ్ సైంటిస్ట్ రవి శంకర్ నేతృత్వంలోని బృందం దానిపై ఇప్పటికే రీసెర్చ్ మొదలుపెట్టింది.
వేర్వేరుగా పనితీరును కనబరిచే యాంటీ వైరల్ మందులను కలిపి వాడితే మెరుగైన ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారని, అలాంటి రెండు కాంబినేషన్లపై తాము ప్రయోగాలు చేస్తున్నామని రవిశంకర్ వివరించారు. ఉమిఫెనోవిర్–మోల్నుపిరవిర్, ఉమిఫెనోవిర్–నిక్లోసమైడ్ (యాంటీ పారాసైటిక్) మందులతో ట్రీట్ మెంట్ చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. మోల్నుపిరవిర్ తో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో కేవలం అత్యవసర వినియోగానికే మన దేశంలో ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే మోల్నుపిరవిర్ కాంబినేషన్ లో దాని డోసేజ్ వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తున్నామన్నారు. దానికి ఉమిఫెనోవిర్ ను కలపడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. కండరాల డ్యామేజీ, ఎముక కార్టిలేజ్ దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు రావని అన్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కరోనా చికిత్సలో ప్రభావవంతమైన ఔషధంగా ఉమిఫెనోవిర్ ఉపయోగపడుతుందన్నారు.
కరోనా చికిత్సలో నిక్లోసమైడ్ ను వాడుతున్నా.. భారీ మోతాదులో తీసుకోవాల్సి ఉంటోందని, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని రవిశంకర్ వెల్లడించారు. మంచి ఫలితాలు రావాలంటే ఉమిఫెనోవిర్ తో కలిపి నిక్లోసమైడ్ ను పక్కాగా ఎంత మోతాదులో ఇవ్వాల్సి ఉంటుందన్నదానిపై రీసెర్చ్ చేస్తున్నామన్నారు.
కరోనాలోని అన్ని వేరియంట్లకూ ఒకే చికిత్సను అందించేందుకు వీలుగా ఔషధాలపై సీడీఆర్ ఐ టీం రాత్రింబవళ్లూ పనిచేస్తోందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ తపస్ కుందూ చెప్పారు. ప్రస్తుతానికి ఉమిఫెనోవిర్ తో మంచి ఫలితాలను సాధిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.