Goa: పార్టీలు ఫిరాయించడంలో గోవా ఎమ్మెల్యేల రికార్డు
- ఫిబ్రవరి 14న గోవా అసెంబ్లీ ఎన్నికలు
- గోవా అసెంబ్లీలో 40 స్థానాలు
- ఏడీఆర్ తాజా నివేదిక
- గత ఐదేళ్లలో 24 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారని వెల్లడి
భారత్ లోని చిన్న రాష్ట్రాల్లో గోవా ఒకటి. అక్కడి అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ది అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గోవా అసెంబ్లీలో 40 మంది శాసనసభ్యులు ఉండగా, వారిలో అత్యధికులు ఫిరాయింపుదార్లేనని ఏడీఆర్ వెల్లడించింది.
గత ఐదేళ్ల కాలంలో 60 శాతం మంది ఎమ్మెల్యేలు వివిధ పార్టీలు మారారని తెలిపింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఐదేళ్ల కాలవ్యవధిలో ఇంతమంది ఫిరాయింపుదార్లు కనిపించలేదని, ఈ విషయంలో గోవా రికార్డు నమోదు చేసిందని ఏడీఆర్ పేర్కొంది.
"ప్రస్తుత ప్రభుత్వం 2017లో ఏర్పాటైంది. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో 24 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఓటర్ల విశ్వాసంపై ఏమాత్రం గౌరవం లేదనడానికి ఇదే నిదర్శనం. హద్దుల్లేని స్వార్థంతో నైతిక విలువలకు తిలోదకాలిస్తూ, క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారు" అని వివరించింది. కాగా, పార్టీలు మారినవారిలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొంది.