Monkey Fever: కర్ణాటకలో కలకలం రేపుతున్న మంకీ ఫీవర్
- రెండేళ్ల తర్వాత మళ్లీ వెలుగు చూసిన మంకీ ఫీవర్
- అప్పట్లో 26 మంది మృతి
- ఈ ఏడాది ఇదే తొలి కేసు
- కోతుల నుంచి మనిషికి..
దేశంలో ఒకవైపు కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న వేళ కర్ణాటకలో రెండేళ్ల తర్వాత మంకీ ఫీవర్ కేసు ఒకటి వెలుగు చూడడం కలకలం రేపుతోంది. షిమోగా జిల్లాకు చెందిన 57 ఏళ్ల మహిళకు మంకీ ఫీవర్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.
ఈ ఏడాది నమోదైన తొలి మంకీ జ్వరం కేసు ఇదే. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇది వైరల్ జబ్బు. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. కోతుల ద్వారా మనుషులకు సోకుతుంది.