Narendra Modi: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ప్రధాని మోదీ నివాళి
- ఆయన అందించిన సేవలకు గర్వపడాలి
- చంద్రబోస్ జయంతి *పరాక్రమ్ దివస్@ గా నిర్వహణ
- ట్విట్టర్ లో ప్రధాని స్పందన
స్వాతంత్య్ర పోరాట యోధుడు, అజాద్ హిందు ఫౌజ్ (భారత సైన్యం) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నివాళులు అర్పించారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మోదీ ట్విట్టర్ పేజీపై స్పందించారు. సుభాష్ చంద్ర బోస్ జయంతిని ‘పరాక్రమ్ దివస్’ గా జరుపుకోవాలని తమ సర్కారు నిర్ణయించినట్టు ప్రకటించారు.
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నా నమస్కారములు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా దేశానికి ఆయన చేసిన గొప్ప సేవలకు ప్రతి భారతీయుడు గర్వపడాలి’’అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద చంద్రబోస్ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని గత వారమే ప్రకటించారు. అప్పటి వరకు అదే స్థానంలో హోలోగ్రామ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం సాయంత్రం ఈ హోలోగ్రామ్ ను ప్రధాని ఆవిష్కరించనున్నారు.