Telanagana schools: తెలంగాణలో జనవరి 24 నుంచి సగం సిబ్బందితో తెరుచుకోనున్న హైస్కూళ్లు
- 8,9,10వ తరగతులకు ఆన్ లైన్ క్లాసులు
- ప్రభుత్వ పాఠశాలల్లో సగం సిబ్బందితో నిర్వహణ
- ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
ఈ నెల 12 నుంచి సెలవులతో మూతపడిపోయిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. జనవరి 16 వరకు పండుగ సెలవులను తెలంగాణ సర్కారు తొలుత ప్రకటించగా, ఒమిక్రాన్ కేసులు జోరుగా పెరుగుతుండడం చూసి ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని, పాఠశాలలు తెరిచేందుకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోవడం గమనార్హం.
దీంతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24 (సోమవారం) నుంచి 8, 9, 10 తరగతులకు ఆన్ లైన్ క్లాసులు చేపట్టేందుకు అనుమతించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రోజువారీ రొటేషన్ విధానంలో హాజరు కావాలంటూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. దీంతో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను తెరిచి ఆన్ లైన్ క్లాస్ లను నిర్వహించనున్నారు.
మరోవైపు జేఎన్టీయూ హైదరాబాద్ ఈ నెల 30 వరకు ఎటువంటి పరీక్షలు నిర్వహించవద్దంటూ తన పరిధిలోని కాలేజీలన్నింటికీ ఆదేశాలు ఇచ్చింది.