Mohammed Rizwan: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా పాక్ ఆటగాడు రిజ్వాన్ మహ్మద్
- టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు
- ప్రకటన చేసిన ఐసీసీ
- సూపర్ ఫామ్ లో ఉన్న రిజ్వాన్
- 29 మ్యాచ్ ల్లో 1326 పరుగులు
ఇటీవల కాలంలో భీకర ఫామ్ లో ఉన్న పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ ను ఐసీసీ పురస్కారం వరించింది. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2021గా రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. రిజ్వాన్ ఫామ్ గురించి చెప్పాలంటే టీ20ల్లో అతడి గణాంకాలు చూస్తే సరి.
గత సీజన్ లో 29 మ్యాచ్ లు ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ 1,326 పరుగులు సాధించాడు. సగటు 73.66 కాగా, స్ట్రయిక్ రేట్ 134.89. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరడంలో రిజ్వాన్ ప్రధాన పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల్లో మూడోవాడిగా నిలిచాడు.
ఇక, ఐసీసీ వర్ధమాన క్రికెటర్ గా దక్షిణాఫ్రికా యువ ఆటగాడు జేన్ మన్ మలాన్ ఎంపికయ్యాడు. మలాన్ ప్రస్తుతం భారత్ తో వన్డే సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐసీసీ అనుబంధ దేశాల ఈ ఏటి మేటి క్రికెటర్ గా జీషన్ మక్సూద్ (ఒమన్), అనుబంధ దేశాల ఈ ఏటి మేటి మహిళా క్రికెటర్ గా ఆండ్రియా మే జెపెడా (ఆస్ట్రియా) ఎంపికయ్యారు.