Nadendla Manohar: పిల్లలు కరోనా బారినపడుతున్నారు... ఫిబ్రవరి రెండో వారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి: నాదెండ్ల
- ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ
- కొత్తగా 14 వేల కేసులు
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్
- ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారంటూ ఆగ్రహం
ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుంటే స్కూళ్లు నిర్వహిస్తున్నారంటూ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కరోనా కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయని, పిల్లలు కరోనా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండో వారం వరకు రాష్ట్రంలో విద్యాసంస్థలు మూసివేయాలని డిమాండ్ చేశారు.
కరోనా కేసులు పెరిగితే విద్యాసంస్థల మూసివేత గురించి ఆలోచిద్దామని ఇటీవల విద్యాశాఖ మంత్రి అన్నారని, ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన రోజున 4 వేల కేసులు ఉంటే, ఇవాళ 14 వేల కేసులు వచ్చాయని నాదెండ్ల పేర్కొన్నారు. మరి కేసులు పెరిగినట్టు కాదా విద్యాశాఖ మంత్రిగారూ? అని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని కేసులు పెరగాలి? ఎన్ని లక్షల యాక్టివ్ కేసులు ఉండాలి? అని నిలదీశారు.
"రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే పాఠశాలలకు పిల్లలను పంపించడంలేదు. కొన్ని స్కూళ్లలో తరగతికి ఒకరిద్దరు విద్యార్థులే ఉంటున్నారని మా దృష్టికి వచ్చింది. కరోనా బారినపడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. తమ బిడ్డలు కరోనా బారినపడకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు ఆదుర్దా పడుతున్నారు. వీళ్ల ఆందోళనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఫిబ్రవరి రెండో వారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి. తద్వారా చిన్నారులను కరోనా నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది.
మహారాష్ట్రలో స్కూళ్లు తెరుస్తామంటే 60 శాతం మంది తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదు. ఫీవర్ సర్వేలో, ప్రతి నలుగురిలో ఒకరు కరోనాతో బాధపడుతున్నారని వెల్లడైంది. వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతుండడంతో వైద్య సేవలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని కరోనా టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులో ఉండడంలేదు. ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలి" అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.