Rahul Dravid: దీపక్ చాహర్ కు మరిన్ని అవకాశాలు: రాహుల్ ద్రావిడ్
- ఇచ్చిన అవకాశాల్లో చక్కగా రాణిస్తున్నాడు
- బాల్ తో, బ్యాట్ తో ఏం సాధించగలడో తెలుసు
- శార్దూల్ సైతం మెరుగ్గా రాణిస్తున్నాడు
ఆల్ రౌండర్ దీపక్ చాహర్ కు భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మద్దతు లభించింది. తనకు లభించిన కొన్ని అవకాశాల్లో దీపక్ చాహర్ తన ప్రతిభ ఏమిటో చూపించాడని కొనియాడారు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డే మ్యాచులో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలవడం తెలిసిందే.
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ 65, శిఖర్ ధావన్ 61 తో సమానంగా దీపక్ చాహర్ సైతం 54 పరుగులు చేసి ఘోర పరాభవాన్ని తప్పించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. చివరి వరుసలోని బ్యాట్స్ మెన్ కొంచెం జాగ్రత్తగా ఆడి ఉంటే గెలుపు భారత్ వశమయ్యేది.
దీపక్ చాహర్ చక్కని ప్రదర్శన నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లోనూ, ఇప్పుడు కూడా దీపక్ చాహర్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్టు చెప్పారు.
‘‘బాల్ తోనూ అతడే ఏం చేయగలడో మాకు తెలుసు. అతడు చక్కగా బ్యాటింగ్ కూడా చేయగలడు. కనుక అతడి విషయంలో మాకు ఎక్కువ ఛాయిస్ వున్నట్టే. చాహర్ తోపాటు, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. గత కొన్ని మ్యాచుల్లో బాల్, బ్యాట్ తోనూ రాణించాడు. కనుక దీపక్, శార్దూల్ కు మరిన్ని అవకాశాలు ఇవ్వనున్నాం’’అని ద్రావిడ్ తెలిపాడు.
2019 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు పెద్దగా వన్డే మ్యాచులు ఆడింది లేదని ద్రావిడ్ గుర్తు చేశాడు. కనుక దక్షిణాఫ్రికాతో సిరీస్ తమకు కనువిప్పు కలిగించేదిగా వుందని వ్యాఖ్యానించాడు. అదృష్టవశాత్తూ 2023 ముందు సన్నద్ధతకు తగిన సమయం ఉన్నట్టు పేర్కొన్నాడు.