Kishan Reddy: తెలంగాణ సర్కారు సహకారం లేకనే రైల్వే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
- రైల్వే ప్రాజెక్టుల నేపథ్యంలో కేంద్రంపై టీఆర్ఎస్ విమర్శలు
- బదులిచ్చిన కిషన్ రెడ్డి
- మోదీ వచ్చాక తెలంగాణకు నిధులు పెరిగాయని వెల్లడి
- రాష్ట్ర సర్కారు తన వంతు వ్యయం భరించాలని సూచన
రైల్వే ప్రాజెక్టుల అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు భరించాల్సిన వ్యయాన్ని, కావల్సిన భూకేటాయింపులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.
మోదీ ప్రధానిగా వచ్చాక తెలంగాణకు నిధుల కేటాయింపు 9 రెట్లు పెరిగిందని తెలిపారు. 2014-15 బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు రూ.250 కోట్లు కాగా, 2021-22 నాటికి కేటాయింపులు రూ.2,420 కోట్లకు పెరిగాయని వివరించారు. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ 194 రూట్ కిలోమీటర్లు పెరిగినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో ఏయే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయో అన్నింటిని ఆయన తన లేఖలో వివరంగా పొందుపరిచారు.