Pakistan: ఐసీసీ అవార్డుల్లో పాకిస్థాన్ క్రికెటర్ల హవా

Pakistan cricketers leading the way in ICC Awards

  • 2021 సీజన్ కు అవార్డులు ప్రకటించిన ఐసీసీ
  • టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా మహ్మద్ రిజ్వాన్
  • వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా బాబర్ అజామ్
  • ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా షహీన్ అఫ్రిది

గత సీజన్ లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది. 2021లో అత్యుత్తమ టీ20 ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక కాగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. బాబర్ గతేడాది 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు సాధించాడు. వాటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.

ఇక, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా పొడగరి ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది ఎంపికయ్యాడు. అఫ్రిది గతేడాది అన్ని ఫార్మాట్లలో 36 మ్యాచ్ లు ఆడి 78 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ వర్ధమాన మహిళా క్రికెటర్ అవార్డును పాకిస్థాన్ కు చెందిన ఫాతిమా సనా చేజిక్కించుకుంది. 20 ఏళ్ల ఫాతిమా సనా పేస్ బౌలర్. 16 మ్యాచ్ లలో 24 వికెట్లు తీసి సత్తా చాటింది. గతేడాది కాలంగా పాకిస్థాన్ టీ20, వన్డే జట్లలో కీలక సభ్యురాలిగా ఎదిగింది.

అటు, 2021 సీజన్ కు గాను అత్యుత్తమ టెస్టు ప్లేయర్ గా ఇంగ్లండ్ సారథి జో రూట్ ఎంపికయ్యాడు. రూట్ 15 మ్యాచ్ ల్లో 1,708 పరుగులు నమోదు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉండడం విశేషం.

ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా స్మృతి మంధన

భారత్ కు చెందిన డాషింగ్ మహిళా క్రికెటర్ స్మృతి మంధనను ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం వరించింది. ఎడమచేతివాటం మంధన గత సీజన్ లో 22 మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీల సాయంతో 855 పరుగులు చేసింది. స్మృతి మంధన 2018లోనూ ఈ పురస్కారం అందుకుంది.

  • Loading...

More Telugu News