NASA: టోంగా అగ్నిపర్వతం పేలుడు ముందు హిరోషిమా అణువిస్ఫోటనం కూడా చిన్నబోవాల్సిందే: నాసా
- జనవరి 15న పసిఫిక్ మహాసముద్రంలో విస్ఫోటనం
- బద్దలైన హుంగా టోంగా అగ్నిపర్వతం
- వందలాది అణుబాంబులకు సమానమన్న నాసా
- 40 కిమీ ఎత్తున ధూళి ఆవరించిందని వెల్లడి
ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో టోంగా దీవులకు సమీపంలో భారీ అగ్నిపర్వతం (హుంగా టోంగా-హుంగా హాపై) బద్దలవడం తెలిసిందే. దీనిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. టోంగా అగ్నిపర్వతం పేలుడు ముందు హిరోషిమా అణువిస్ఫోటనం కూడా చిన్నదే అవుతుందని పేర్కొంది. ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అత్యంత భారీ శక్తి విడుదలైందని, నాడు హిరోషిమా నగరంపై అమెరికా జారవిడిచిన అణుబాంబు కంటే వందలాది రెట్లు అధికమని నాసా ఎర్త్ అబ్జర్వేటరీ వెల్లడించింది. మొత్తమ్మీద 5 నుంచి 30 మిలియన్ టన్నుల శక్తి విడుదలై ఉంటుందని తెలిపింది.
హుంగా టోంగా అగ్నిపర్వతం పేలుడు ధాటికి 40 కిలోమీటర్ల ఎత్తుకు ధూళి ఎగిసిందని, భారీగా సునామీ అలలు విరుచుకుపడ్డాయని వివరించింది. ఈ అగ్నిపర్వతం పేలుడుతో గాలి, నీరు విషపూరితంగా మారాయని, పంటలు నాశనం అయ్యాయని పేర్కొంది. అంతేకాదు, దీని ప్రభావంతో రెండు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని నాసా వెల్లడించింది. దీని కారణంగా టోంగాలోనే కాకుండా, పెరూ దేశంలో బీచ్ లకు వెళ్లిన వారు కూడా పలువురు మృత్యువాతపడ్డారని తెలిపింది.
ప్రపంచ దేశాలన్నీ కరోనాతో సతమతమవుతుండగా, ఆ మహమ్మారిని ఆమడదూరంలో నిలిపివేసిన టోంగాను అగ్నిపర్వతం పేలుడు కుదిపివేసింది. ప్రస్తుతం అక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ దేశాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.