Kagiso Rabada: ఆ ముగ్గురు బౌలర్లను ప్రతి జట్టు కోరుకుంటుంది.. మేమూ పోటీ పడతాం: కేఎల్ రాహుల్
- రబాడ, జాన్సేన్, రస్సీ వాండెర్సెన్
- వీరు మేటి బౌలర్లు
- మెగా వేలంలో వీరి కోసం పోటీ పడతామన్న రాహుల్
దక్షిణాఫ్రికా బౌలర్లు కగిసో రబాడ, మాక్రో జాన్సెన్, రస్సీ వాండెర్సెన్ కోసం ప్రతి జట్టు పోటీపడుతుందని, లక్నో సూపర్ జెయింట్స్ కూడా వీరిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు.
‘‘రబాడ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలర్ గా పనిచేశాడు. ఆ జట్టు విజయాల్లో ఎంతో పాత్ర పోషించాడు. ప్రతి జట్టు రబాడ వంటి ఆటగాడిని కోరుకుంటుంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే స్మార్ట్ క్రికెటర్ అతడు’’ అని రాహుల్ వివరించాడు.
వాండెర్సెన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, స్పిన్ అదిరిపోతుందని చెప్పాడు. ‘‘ఒక ఫ్రాంచైజీ విదేశీ బ్యాటర్ ను ఎంపిక చేసుకుంటే మెరుగ్గా ఉంటుంది. ఐపీఎల్ ను భారత్ లో ఆడతాం. కనుక మధ్య ఓవర్లలో ఎంతో మంది స్పిన్నర్లను వినియోగించుకోవచ్చు’’ అని వివరించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కు రాహుల్ కెప్టెన్ కాగా, స్టోనియస్, రవి బిష్ణోయ్ లను కూడా ఇప్పటికే ఎంపిక చేసుకుంది. ఇందులో రవి బిష్ణోయ్ కు మంచి భవిష్యత్తుతోపాటు , చక్కగా పోరాడగల సత్తా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. భారత జట్టుకు భవిష్యత్తు మెరిక ఇతడేనని చెప్పాడు.