Cricket: నా కెరీర్ ఎప్పుడూ నిదానమే.. కెప్టెన్సీపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ పరాభవం
- రాహుల్ కెప్టెన్సీపై నిపుణుల అనుమానాలు
- సమర్థంగా నడిపించగలనన్న రాహుల్
- ఆరంభ విజయాలతో పోలిస్తే ఓటములతోనే దృఢమవుతామని కామెంట్
ఎన్నో అంచనాలతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ కు ఇటు టెస్టులతో పాటు.. అటు వన్డేల్లోనూ ఘోర పరాభవం తప్పలేదు. వన్డేల్లో అయితే క్లీన్ స్వీప్ చేసేసింది ప్రొటీస్ టీం. దీంతో ఇప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్య ఓవర్లలో బౌలింగ్ మార్పులను సరిగ్గా వినియోగించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, తన కెప్టెన్సీపై రాహుల్ స్పందించాడు.
దేశానికి నేతృత్వం వహించాలన్న తన కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు. ఫలితం అనుకూలంగా రాకపోయినా దాని నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. ప్రపంచకప్ లు రాబోతున్నాయని, ముందు దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని తెలిపాడు. నాలుగైదేళ్లుగా మంచి క్రికెట్ ఆడామని, అయితే, వైట్ బాల్ క్రికెట్ లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాహుల్ చెప్పాడు.
రాహుల్ ను దీర్ఘకాలంలో కెప్టెన్ గా ఊహించుకోలేమన్న నిపుణుల వ్యాఖ్యల నేపథ్యంలో.. జట్టును సమర్థంగా నడిపించగలనని, తన కెప్టెన్సీపై తనకు బాగా నమ్మకముందన్నాడు. జట్టుగా తాము మరింత ఎదగాల్సి ఉందని తెలిపాడు. జట్టును నడిపే సందర్భంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఆరంభంలోనే వచ్చే విజయాలతో పోలిస్తే ఓటములతోనే మరింత దృఢంగా తయారవుతామని వివరించాడు.
చేస్తూ ఉంటూనే మెరుగవుతామన్నాడు. తన కెరీర్ ఎప్పుడూ అలాగే ఉందని, ఎప్పుడూ నిదానంగానే సాగిందని అన్నాడు. తన జట్టులోని ఆటగాళ్ల నుంచి అత్యుత్తమమైన ప్రదర్శనను రాబట్టగలనని ధీమా వ్యక్తం చేశాడు. దేశమైనా, ఐపీఎల్ టీం అయినా మెరుగ్గా రాణించగలనని పేర్కొన్నాడు.