Supreme Court: 'ఉచిత' హామీలపై సీజేఐ జస్టిస్ రమణ అసహనం.. తీవ్రమైన సమస్యంటూ ఈసీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

CJI Says Freebies Before Election Is Serious Issued Notices To Center and EC

  • ఎన్నికలను ప్రభావితం చేస్తాయి
  • ఎలక్షన్లలో పారదర్శకత లోపిస్తుంది
  • మామూలు బడ్జెట్ కన్నా ఉచితాల బడ్జెట్టే ఎక్కువైంది

ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడం అత్యంత తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత హామీలను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని, ఉచిత హామీలిచ్చే పార్టీలను రద్దు చేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం ఇవాళ విచారించింది.

సాధారణ బడ్జెట్ తో పోలిస్తే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీల బడ్జెట్టే ఎక్కువైపోతోందని అసహనం వ్యక్తం చేసింది.  దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. ఉచిత హామీల వల్ల ఎన్నికలు ప్రభావితమవడమే కాకుండా, ఎన్నికల్లో పారదర్శకత కూడా లోపిస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు.

‘‘ఇంతకుముందు ఇదే విషయానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చాం. దానిపై ఒకేఒక్కసారి ఈసీ సమావేశమైంది. రాజకీయ పార్టీల అభిప్రాయం అడిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో.. దాని ఫలితమేంటో కూడా నాకు తెలియదు’’ అని అన్నారు. ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడంపై 2013లోనే సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.

అయితే, ఉచిత హామీలిచ్చినంత మాత్రాన వాటిని ‘అవినీతి ఎన్నికలు’ అని చెప్పలేమనీ కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. ఇలాంటి ఉచిత హామీలను గతంలోనూ కోర్టు ఎన్నో చూసిందని, కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే రాజకీయ పార్టీలు ఎన్నెన్నో ఉచిత హామీలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, ఉచిత హామీల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు. దాని వల్ల రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిపై రూ.3 లక్షల రుణభారం పడిందని చెప్పారు.

  • Loading...

More Telugu News