Anand Mahindra: మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానంపై ఆనంద్ మహీంద్ర అసహనం!

Anand Mahindra Responds To Humiliation Faced By A Farmer in Mahindra Show Room

  • వ్యక్తి గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది
  • మా భాగస్వాముల అభివృద్ధికి పనిచేయడమే మా విధానం
  • ఆ సిద్ధాంతాలను మీరితే వెంటనే చర్యలు తీసుకుంటామన్న ఆనంద్ 

మహీంద్రా షోరూంలో ఓ రైతుకు జరిగిన అవమానం పట్ల సంస్థ యజమాని ఆనంద్ మహీంద్రా అసహనం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందని అన్నారు. కర్ణాటకలోని కెంపెగౌడకు చెందిన ఓ రైతు బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు తుమకూరు మహీంద్ర షోరూంకు వెళ్లగా.. ‘రూ.10 కూడా ఉండవు రూ.10 లక్షల కారు కొంటావా?’ అంటూ సేల్స్ మన్ అవహేళనగా మాట్లాడడం జరిగింది.

దీంతో అహం దెబ్బతిన్న ఆ రైతు, అరగంటలో డబ్బు తెస్తానని సవాల్ చేసి, అన్నట్టుగానే తీసుకొచ్చాడు. అయితే, అప్పటికప్పుడు పికప్ ట్రక్ ను డెలివర్ చేయలేమని సేల్స్ మన్ చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు.

‘‘మా కమ్యూనిటీలోని వారు, భాగస్వాముల అభివృద్ధి కోసం పనిచేయడమే మహీంద్ర సంస్థ ప్రధాన విధానం. వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడడం మా ప్రధాన విలువ. ఈ సిద్ధాంతాలను రాజీ లేకుండా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని మీరినట్టు తెలిస్తే అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇటు సంస్థ సీఈవో విజయ్ నక్రా కూడా స్పందించారు. తమ వినియోగదారుల గౌరవాన్ని కాపాడడం తమ బాధ్యతని అన్నారు. డీలర్లూ వినియోగదారుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కస్టమర్లను గౌరవించే విషయంలో ఫ్రంట్ లైన్ సిబ్బందికి కౌన్సిలింగ్, శిక్షణనిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News