Andhra Pradesh: అటెన్షన్! ఏపీలో కొత్త జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు

AP Govt Changes small Corrections in new dist names
  • ప్రతి జిల్లాకు వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు జారీ
  • రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి  
  • భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి
  • వైఎస్సార్ కడప జిల్లా ఇకపై వైఎస్సార్ జిల్లా
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం నిన్న ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 26 జిల్లాలకు సంబంధించి వరుసగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై స్థానికులకు ఏవైనా అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక, మంగళవారం రాత్రి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెమొరాండానికి, గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి మధ్య స్వల్ప తేడాలు ఉండడం గమనార్హం.

నిజానికి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమొరాండంలో తూర్పు గోదావరి జిల్లాకు కాకినాడ, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లాగా, పశ్చిమ గోదావరి జిల్లాకు ఏలూరు, నరసాపురం జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా పేర్కొన్నారు.

అయితే, గెజిట్ నోటిఫికేషన్‌లో మాత్రం కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం కేంద్రంగా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటయ్యే జిల్లాలలో అధిక భాగం గోదావరీ పరీవాహక ప్రాంతం కావడంతో ఆయా జిల్లాలకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలుగా నామకరణం చేస్తే బాగుంటుందని కొందరు మంత్రులు సూచించారట. దీంతో మంగళవారం రాత్రి నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

అలాగే, ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు మెమొరాండంలో పేర్కొనగా గెజిట్ నోటిఫికేషన్‌లో ఆ పేరు ఎగిరిపోయింది. దాని స్థానంలో కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని మెమొరాండంలో పేర్కొనగా గెజిట్‌లో మాత్రం పెనుకొండ, పుట్టపర్తితోపాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఈ మార్పులతోపాటు కొన్ని అక్షర దోషాలను కూడా ప్రభుత్వం సరిచేసింది. తిరుపతి అర్బన్ జిల్లా విషయంలో ఇంగ్లిష్‌లో టీహెచ్ఐ (THI)  అని తొలుత పేర్కొనగా, ఇప్పుడు దానిని టీఐ (TI)గా మార్చారు. అర్థంలో ఎలాంటి మార్పు లేకున్నా స్థానికంగా వినియోగించే దానినే ప్రాతిపదికగా తీసుకున్నారు. అలాగే, ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా అని తొలుత పేర్కొనగా, ఇప్పడు దానిని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా సవరించారు. వైఎస్సార్ కడప పేరును వైఎస్సార్ జిల్లాగా, మండలం పేరును బీఎన్ కండ్రిగకు బదులుగా బుచ్చినాయుడు కండ్రిగగా గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
Andhra Pradesh
Districts
YSR Kadapa
Rajamahendravaram
Gazette Notification

More Telugu News