Azam Khan: జైలు నుంచే నామినేషన్ దాఖలు చేసిన ఆజంఖాన్
- యూపీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆజంఖాన్
- పలు ఆరోపణలతో సీతాపూర్ జైల్లో ఉన్న వైనం
- బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ఎస్పీ కీలక నేత
సమాజ్ వాదీ పార్టీ కీలక నేత ఆజంఖాన్ జైలు నుంచే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైల్లో ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాంపూర్ సదర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భూకబ్జాలతో పాటు ఇతర ఆరోపణలపై 2020 ఫిబ్రవరి నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. ఆజంఖాన్ నామినేషన్ వేసినట్టు ఆయన చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్ ఆసిం రజా తెలిపారు. ఆయనను బెయిల్ పై బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పై బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు. ఆజంఖాన్ కు కోర్టు బెయిల్ నిరాకరించినా... అఖిలేశ్ మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. యూపీలో మాఫియా డాన్ లు తాము చట్టానికి అతీతమని భావిస్తుంటారని, నేరగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారని... యోగి సీఎం అయిన తర్వాత వీరంతా భయంతో కాలాన్ని వెళ్లదీస్తున్నారని చెప్పారు. మరోవైపు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలవడనున్నాయి.