Air India: అధికారికంగా ఎయిరిండియా పగ్గాలు అందుకున్న టాటా గ్రూప్
- నష్టాల్లో ఎయిరిండియా
- కేంద్రానికి భారంగా మారిన సంస్థ
- రూ.18 వేల కోట్లకు కొనుగోలు చేసిన టాటాలు
- 67 ఏళ్ల తర్వాత సొంతగూటికి ఎయిరిండియా
భారత ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా మళ్లీ టాటాల పరమైంది. టాటా గ్రూప్ ఇవాళ అధికారికంగా ఎయిరిండియా పగ్గాలు అందుకుంది.
దీనిపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పందిస్తూ, ఎయిరిండియా సంస్థ నేటి నుంచి టాటా గ్రూప్ అధీనంలో నడుస్తుందని పేర్కొన్నారు. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్ గూటికి చేరడం పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని, ఈ సంస్థను ప్రపంచస్థాయి ఎయిర్ లైనర్ గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రశేఖరన్ తెలిపారు. ఎయిరిండియాను అధికారికంగా హస్తగతం చేసుకునేందుకు ముందు చంద్రశేఖరన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
అటు, కేంద్ర పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే స్పందిస్తూ... ఎయిరిండియాకు చెందిన 100 శాతం వాటాలను నేడు మెసర్స్ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు విజయవంతంగా బదలాయించినట్టు వెల్లడించారు. టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా గ్రూపు అనుబంధ సంస్థ. 2021లో కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లకు ఎయిరిండియాను టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన విభాగంతో పాటు ఎయిరిండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిరిండియా శాట్స్ విభాగాల్లో 50 శాతం వాటాలు కూడా టాటా గ్రూప్ పరమవుతాయి.
ఎయిరిండియా నష్టాల్లో ఉండడంతో కేంద్రం రూ.12,906 కోట్ల రిజర్వ్ ధరతో అమ్మకానికి పెట్టింది. దేశీయ విమాన సంస్థను చేజిక్కించుకునేందుకు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నేతృత్వంలోని కన్సార్టియం రూ.15,100 కోట్లు ఆఫర్ చేసింది. అయితే, టాటా గ్రూప్ అంతకు మరో మూడు వేల కోట్లు అదనంగా ఆఫర్ చేయడంతో కేంద్రం సంతృప్తి చెందింది. ఎయిరిండియాను నేటితో పూర్తిగా టాటాల పరం చేసింది. టాటా గ్రూప్ కు ఇప్పటికే ఎయిర్ ఏషియా, విస్తారా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి.
వాస్తవానికి ఎయిరిండియా టాటాల మానసపుత్రిక. టాటా ఎయిర్ లైన్స్ పేరుతో జేఆర్డీ టాటా 1932లో ఓ సంస్థను స్థాపించారు. 1946లో దీని పేరును ఎయిరిండియాగా మార్చారు. 1953లో దీన్ని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ జేఆర్డీ టాటానే ఎయిరిండియా చైర్మన్ గా 1977 వరకు కొనసాగారు. తాజా కొనుగోలుతో ఆరున్నర దశాబ్దాల అనంతరం ఎయిరిండియా మళ్లీ సొంతగూటికి చేరినట్టయింది.