Covid 19: రెండేళ్లు దేశ సరిహద్దులను మూసేసుకున్నా.. చివరికి కరోనాకు చిక్కిన ‘కిరిబటి’! 

Covid 19 hits one of the last uninfected places on the planet

  • ఈ నెలలోనే సరిహద్దులను తెరిచిన దేశం
  • క్రైస్తవ మత బోధకులకు ఆహ్వానం
  • తిరిగొచ్చిన 54 మంది
  • సగం మందికి పాజిటివ్
  • 181కు పెరిగిన కేసుల సంఖ్య

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే పసిఫిక్ ప్రాంతంలోని ద్వీప సమూహ దేశం కిరిబటి ముందే మేల్కొంది. వెంటనే తన సరిహద్దులను మూసేసింది. తన తీరానికి కరోనా చేరకుండా రెండేళ్లపాటు చాలా కట్టుదిట్టంగా వ్యవహరించింది. అయినా, చివరికి కరోనా మహమ్మారి ఆ దేశాన్ని వదల్లేదు.

రెండేళ్లపాటు ఓపిక పట్టిన కిరిబటి చివరికి తన సరిహద్దులను తాజాగా తెరవడంతో మహమ్మారిని ఆహ్వానించినట్టయింది. విదేశాలలో నిలిచిపోయిన క్రైస్తవ మత బోధకులు చార్టర్ విమానంలో తిరిగి వచ్చేందుకు కిరిబటి ఈ నెలలోనే అనుమతించింది. దీంతో 54 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరంతా సరిహద్దులను మూసివేయడానికి ముందు కిరిబటి నుంచి విదేశీ మిషనరీలకు వెళ్లినవారు.

తిరిగి వచ్చిన ప్రతి ప్రయాణికుడిని ఫిజీకి సమీపంలోనే మూడు సార్లు టెస్ట్ చేసి అనుమతించింది. దేశానికి తిరిగొచ్చిన తర్వాత క్వారంటైన్ కూడా చేసింది. కానీ, ఎక్కడో తేడా కొట్టింది. తిరిగొచ్చిన వారిలో సగానికిపైగా వైరస్ పాజిటివ్ అని తర్వాత తేలింది. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశకు చేరిపోయింది. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 181కి చేరింది.

కిరిబటి జనాభా 1,13,000 మందిలో 33 శాతం మందికే రెండు డోసుల టీకా ఇవ్వడం పూర్తయింది. 59 శాతం మందికి ఒక డోస్ ఇచ్చారు. ప్రపంచం నలుమూలలకూ కరోనా విస్తరించినందున ఇక దీని బారిన పడకుండా ఉండడం కష్టమేనని, టీకాలతోనే రక్షణ ఉంటుందని న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ యూనివర్సిటీ టీకాల నిపుణుడు పెటోసిస్ హారిస్ అన్నారు.

  • Loading...

More Telugu News