Elderly Man: 70 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్న ఘనుడు!
- బ్రిటన్ లో ఘటన
- నాటింగ్ హామ్ లో కెమెరాలకు చిక్కిన కారు
- కంప్యూటర్ విశ్లేషణలో ఆసక్తికర అంశం వెల్లడి
- 12 ఏట నుంచే లైసెన్స్ లేకుండా కారు డ్రైవింగ్
బ్రిటన్ లో ఓ వ్యక్తి గత ఏడు దశాబ్దాలుగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలు నడుపుతున్న వైనం వెల్లడైంది. నాటింగ్ హామ్ కు చెందిన ఆ వృద్ధుడి వయసు 84 సంవత్సరాలు. తన 12వ సంవత్సరం నుంచే అతగాడు లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నాడట. ఇటీవల అతడి చిన్నకారును ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికాగ్నిషన్ (ఏఎన్ పీఆర్) కెమెరాలు క్లిక్ మనిపించగా, కంప్యూటర్ విశ్లేషణలో ఆ కారు డ్రైవర్ కు లైసెన్స్ లేని విషయం తెలిసింది.
అయితే, గత 70 ఏళ్లుగా కారు నడుపుతున్నా ఒక్క ఆక్సిడెంట్ కూడా చేయలేదట. అంతేకాదు, ఇంతవరకు ఎవరూ ఎక్కడా అతడి కారును ఆపి తనిఖీలు చేయలేదట. ఇన్నాళ్లకు అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదన్న విషయం తెలిసి నాటింగ్ హామ్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అతగాడు 1938లో జన్మించాడని, ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ లేవని వెల్లడించారు.
ఇటీవల కాలంలో నాటింగ్ హామ్ నగరంలో ఏఎన్ పీఆర్ కెమెరాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దాంతో ఏ వాహనం ఏ మూల ఉన్నా కెమెరా కళ్ల నుంచి తప్పించుకోలేదని అధికారులు చెబుతున్నారు. అందుకే వాహనదారులు తగిన పత్రాలు ఉంటేనే బయటికి రావాలని సూచిస్తున్నారు.