APSRTC: మా ఉద్యమానికి ఆర్టీసీలోని 10 సంఘాలు మద్దతు ప్రకటించాయి: ఏపీ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు
- 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని చెప్పాయి
- ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయినా వారి సమస్యలు ఇంత వరకు తీరలేదు
- ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆర్టీసీలోని 10 కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయని తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమయినా వారి సమస్యలు ఇంత వరకు తీరలేదని బొప్పరాజు అన్నారు. 2017 నాటి ఎరియర్స్ ఇప్పటి వరకు చెల్లించలేదని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తీర్చని ప్రభుత్వం... ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలని కోరుకుంటోందని విమర్శించారు.
పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమాధానం లేని అనేక ప్రశ్నలు ఆర్టీసీ కార్మికుల ముందు ఉన్నాయని చెప్పారు. తాము చర్చలకు పోవడం లేదని మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు అంటున్నారని... అలాంటి అపవాదును పక్కన పెట్టాలని అన్నారు. సమ్మెకు కారణం ప్రభుత్వమని, ఉద్యోగులు కాదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు.