Daniil Medvedev: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అంపైర్ పై రష్యా టెన్నిస్ స్టార్ తిట్ల పురాణం

Daniil Medvedev fires on chair umpire in Australian Open
  • సెమీస్ లో సిట్సిపాస్ తో తలపడిన మెద్వెదెవ్
  • తండ్రి నుంచి సిట్సిపాస్ కు సలహాలు
  • అంపైర్ పట్టించుకోలేదంటూ మెద్వెదెవ్ ఆగ్రహం
రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇవాళ జరిగిన సెమీఫైనల్లో మెద్వెదెవ్ గ్రీకు ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ ను ఓడించాడు. ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ దశలో మెద్వెదెవ్ వెనుకంజలో ఉన్నాడు. విరామం సమయంలో చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు.

ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ కు గ్యాలరీలోంచి అతడి తండ్రి సలహాలు ఇస్తున్నాడని మెద్వెదెవ్ ఆరోపించాడు. "నీకది కనిపించడంలేదా? నువ్వేమైనా మూర్ఖుడివా?" అంటూ తిట్లపురాణం లంకించుకున్నాడు. ఆ అంపైర్ కోపం వస్తున్నప్పటికీ తమాయించుకుని, మెద్వెదెవ్ కు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

అయితే ఈ రష్యన్ ఆటగాడు శాంతించలేదు. కోర్టులో ఆడుతున్న ఆటగాడికి కోచ్ కాకుండా మరో వ్యక్తి ఎలా సలహాలు ఇస్తాడని ప్రశ్నించాడు. ఓ ఆటగాడికి ఇద్దరి నుంచి సలహాలు అందడం సరైనదేనా? అని నిలదీశాడు. అందుకు అంపైర్ బదులివ్వకపోవడంతో "నువ్వు పెద్ద దుర్మార్గుడిలా ఉన్నావ్" అంటూ మెద్వెదెవ్ మళ్లీ నోటికి పని కల్పించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్ స్పెయిన్ దిగ్గజం రఫెల్ నడాల్ తో తలపడనున్నాడు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో నడాల్... ఇటలీ స్టార్ బెరెట్టినిపై గెలుపొందాడు.
Daniil Medvedev
Umpire
Australian Open
Tsitsipas

More Telugu News