lifestyle changes: జీవనశైలి మార్పులతో ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
- కొన్ని రకాల జన్యువుల పాత్ర కీలకం
- వాటిని నిరోధించడం ద్వారా జీవన కాలం పెంపు
- లండన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
జీన్స్ లేదా జీవనశైలి మనుషుల జీవన కాలంపై ప్రభావం చూపిస్తాయా? ఈ అంశం ఎప్పుడూ శాస్త్రవేత్తలు కొత్తదిగానే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త అంశాలను తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి.
కొన్ని జీవనశైలి మార్పులతో (ఆరోగ్యకరంగా జీవించడం) ఆయుర్దాయాన్ని కొంత పెంచుకోవచ్చని చాలా అధ్యయనాలు తేల్చాయి. మనిషి జీవన కాలాన్ని నిర్ణయించడంలో జన్యువుల పాత్ర కీలకమని శాస్త్రవేత్తలు బలంగా చెబుతున్నారు. వృద్ధాప్యం, జీవన కాలాన్ని నిర్ణయించడంలో జన్యువుల పాత్రకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు.
యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఇటీవలే ఒక పరిశోధన జరిగింది. కొన్ని రకాల జన్యువులు జీవన ప్రమాణాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు. 90 ఏళ్లకు పైగా జీవించిన 11,262 మందిపై గతంలో జరిగిన అధ్యయనాల సమాచారాన్ని సైతం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశీలించారు. ఈ వివరాలను పరిశోధనకు సహ నేతృత్వం వహించిన డాక్టర్ నజీఫ్ అలిక్ సైన్స్ డైలీతో పంచుకున్నారు.
‘‘మన కణాల్లో ప్రొటీన్ల తయారీలో భాగమైన కొన్ని రకాల జన్యువులను అడ్డుకోవడం ద్వారా ఈస్ట్, పురుగులు, ఈగల్లో జీవిత కాలాన్ని పెంచొచ్చని గతంలో జరిగిన విస్తృత స్థాయి పరిశోధనలు చెప్పడాన్ని చూశాం. మనుషుల్లోనూ ఈ జన్యువులను అడ్డుకోవడం ద్వారా వారి జీవిత కాలాన్ని పెంచొచ్చని అధ్యయనంలో తెలిసింది. అది కూడా జీవిత చివరి దశలో కాకుండా, చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది’’ అని నజీఫ్ అలీ వివరించారు.