Andhra Pradesh: మరో తరం కోలుకోలేకుండా దెబ్బ తీశారు.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్
- రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కునెట్టారు
- ఇంకెన్నాళ్లీ పిట్ట కథలు చెబుతారంటూ మండిపాటు
- రాష్ట్ర ఆదాయ–వ్యయాలెంతో చెప్పాలని డిమాండ్
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని, ఇంకెన్నాళ్లు పిట్టకథలు చెబుతారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయం, మూలధన వ్యయం ఎంతో స్పష్టంగా చెప్పాలన్నారు. పథకాలకు పెడుతున్న ఖర్చు కన్నా.. వాటి ప్రచారం ప్రకటనల కోసం పెడుతున్న ఖర్చులే ఎక్కువని ఆరోపించారు.
కొత్త పెట్టుబడులేవీ రాలేదని, రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు నెట్టారని విమర్శించారు. మరో తరం కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని అన్నారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల్లాగా ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకూ అప్పులిచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు.