G Jagadish Reddy: కేసీఆర్ ను ముట్టుకుంటే భస్మమైపోతారు: మంత్రి జగదీశ్ రెడ్డి
- కేసీఆర్ పై కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారు
- పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారు
- అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, ఆయనను టచ్ చేస్తే భస్మమైపోతారని అన్నారు. పైరవీలు, దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం అయినా... అభివృద్ధిలో మాత్రం పరుగు పెడుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సాకారం చేసిన నాయకుడు, సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలను సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
కేసీఆర్ లేకుంటే తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఉండేదా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందేదా? అని అడిగారు. దళారులకు దోచి పెట్టడం, వారితో అంటకాగడం తప్ప బీజేపీ నేతలు చేసిందేముందని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో పేదరికం మరింత పెరిగిందని చెప్పారు. మోదీ పాలనలో దళారులు కుబేరులయ్యారని, దేశం మాత్రం దివాలా తీసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉందని, ఆ పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే తెలియడం లేదని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
75 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ కేవలం ఏడేళ్లలో చేసి చూపించారని జగదీశ్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఉన్నది ఉన్నట్టు అమలు పరిచిన పార్టీ టీఆర్ఎస్ అని చెప్పారు. సంచలనాలకు టీఆర్ఎస్ కేంద్ర బిందువని, అలాంటి పార్టీలో కొనసాగడమే ఒక గౌరవమని అన్నారు.