Adilabad District: అసాధారణ స్థాయిలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

Merucury Dips in Adilabads Arli T in Telangana
  • రాష్ట్రంలో 8 నుంచి 9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • చలికి అల్లాడిపోతున్న జనం
  • రేపు కూడా ఇదే పరిస్థితి
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలిపులి మళ్లీ విజృంభిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 8 నుంచి 9 డిగ్రీలకు తగ్గడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉత్తర తెలంగాణలో శీతల గాలులు వీస్తున్నాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి) గ్రామంలో నిన్నతెల్లవారుజామున అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జనవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు ఇంత కనిష్ఠంగా నమోదు కావడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. రేపు (సోమవారం) కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని అధికారులు తెలిపారు. హిమాలయాల నుంచి శీతల గాలులు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు వీస్తుండడం వల్లే చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, ఆదిలాబాద్ వ్యాప్తంగా నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Adilabad District
Arli T
Temperature
Telangana

More Telugu News