USA: అమెరికాపై ‘మంచు బాంబ్’.. బాంబ్ సైక్లోన్ తో గజగజ!

US Hit With Bombogenesis Five States Announces Emergency

  • ఐదు రాష్ట్రాల్లో అత్యయిక స్థితి
  • న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, రోడ్ ఐలాండ్, వర్జీనియాల్లో తీవ్రంగా ప్రభావం
  • న్యూయార్క్, మసాచుసెట్స్ లలో 2 అడుగుల మేర మంచు
  • 7.5 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం
  • 6 వేల విమానాల రద్దు

అమెరికాపై ఇప్పుడో పెద్ద బాంబ్ పడింది. శత్రు దేశం వాళ్లొచ్చి వేసిన బాంబ్ కాదది. ప్రకృతి సంధించిన మంచు అస్త్రం. ఆ అస్త్రం ధాటికి 24 గంటల్లోనే అమెరికా తూర్పు ప్రాంతమంతా గజగజ వణికిపోతోంది. ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న మంచు ముద్దలతో గడగడలాడిపోతోంది. ఈ మంచు తుపానును నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్ డబ్ల్యూఎస్)కు చెందిన పర్యావరణ వేత్తలు ‘బాంబోజెనిసిస్’ అంటున్నారు. శీతల గాలులు, సముద్రంపైన వేడి గాలులు కలిసి వాతావరణ పీడనం పడిపోయి టెంపరేచర్లు పతనమవడాన్ని బాంబోజెనిసిస్ అని పిలుస్తున్నారు.

దాన్నే సింపుల్ గా బాంబ్ సైక్లోన్ అని అంటున్నారు. నారీస్టర్ అనీ వ్యవహరించే ఈ తీవ్రమైన తుపాను.. నాలుగేళ్లలో రావడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఈ బాంబ్ సైక్లోన్ ధాటికి ఐదు రాష్ట్రాలు అత్యయిక స్థితిని ప్రకటించాయి. న్యూయార్క్, న్యూ జెర్సీ, మేరీల్యాండ్, రోడ్ ఐల్యాండ్, వర్జీనియాల్లోని 7.5 కోట్ల మంది దాని బారిన పడ్డారు. ఫ్లోరిడాను కూడా ఈ తుపాను తాకే ముప్పుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో 6 వేల విమానాలను రద్దు చేశారు. మంచు తుపానుకు తోడు హరికేన్ ముప్పుకూడా పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాలకు ఇప్పటికే వరద ముప్పు హెచ్చరికలను జారీ చేశారు. ఈశాన్య ప్రాంతాల్లో ఇవాళ మొత్తం అతిశీతల పరిస్థితులే ఉంటాయని నిపుణులు హెచ్చరించారు.

న్యూయార్క్, మసాచుసెట్స్ నగరాల్లో రెండడుగుల మందంలో మంచు పొరలు పొరలుగా కప్పేస్తోంది. గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున మంచు రోడ్లపై పేరుకుపోతోందని అంటున్నారు. మసాచుసెట్స్ లో 95 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లాంగ్ ఐలాండ్ లో కార్లపై మంచు కురిసింది. దీంతో ఓ కారులో ఉన్న మహిళ ప్రాణాలు విడిచింది.

  • Loading...

More Telugu News