Narendra Modi: అందరూ ఓపెన్ మైండ్ తో రావాలన్న ప్రధాని.. సమరానికి సై అంటున్న విపక్షాలు!
- కాసేపట్లో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలు
- ఎంపీలందరూ సమావేశాలకు హాజరు కావాలని కోరిన ప్రధాని
- అందరం కలిసి దేశాన్ని ఆర్థికంగా అత్యున్నత శిఖరాలకు చేరుద్దామని పిలుపు
కాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో ఢీకొనడానికి అధికార, విపక్షాలన్నీ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని, ఎంపీలందరూ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో మన దేశానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని... మన దేశం ఆర్థికంగా పుంజుకోవడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగించడం, ఇండియాలో తయారైన కరోనా వ్యాక్సిన్లు వంటి అంశాలు మన దేశంపై ప్రపంచ దేశాల నమ్మకాన్ని పెంచుతున్నాయని అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు బడ్జెట్ సమావేశాలకు ఇబ్బందికరమే అయినప్పటికీ... ఎంపీలందరూ సమావేశాలకు హాజరుకావాలని తాను కోరుతున్నానని ప్రధాని చెప్పారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ సమావేశాలు ఓ బ్లూప్రింట్ ను రూపొందిస్తాయని తెలిపారు. ఈ సమావేశాలను మనం ఎంతగా ఉపయోగించుకుంటే ఫలితాలు అంత బాగా ఉంటాయని చెప్పారు. అందరం కలసి మన దేశాన్ని ఆర్థికంగా అత్యున్నత శిఖరాలకు చేరుద్దామని పిలుపునిచ్చారు. ఎంపీలందరూ ఓపెన్ మైండ్ తో సమావేశాలకు రావాలని కోరారు.