Delhi High Court: ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా వేయాలన్న కాంగ్రెస్ నేత... మీరేమైనా అంగారక గ్రహంపై ఉన్నారా? అంటూ కోర్టు ఆగ్రహం

Delhi High Court comments on Congress leader Jagadish Sharma petition
  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
  • దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉందన్న జగదీశ్ శర్మ
  • ఎన్నికల వాయిదా కోరుతూ పిటిషన్
  • పనికిమాలిన పిటిషన్ అంటూ కోర్టు వ్యాఖ్యలు
పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతుండడం తెలిసిందే. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే, దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నేత జగదీశ్ శర్మ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తోందని తెలిపారు.

అయితే కోర్టు జగదీశ్ శర్మ పిటిషన్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలియదా? మీరేమైనా అంగారక గ్రహంపై ఉన్నారా?" అంటూ జగదీశ్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇదొక చెత్త పిటిషన్. ఢిల్లీలోనూ ఇప్పుడు కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. పిటిషన్ ను మీరు వెనక్కి తీసుకుంటారా లేక మమ్మల్మే డిస్మిస్ చేయమంటారా?" అంటూ జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మీత్ సింగ్ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో, జగదీశ్ శర్మ తరఫు న్యాయవాది తమ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

కాగా, భారత్ లో ఇటీవల మూడు లక్షలకు పైగా కరోనా రోజువారీ కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య రెండు లక్షలకు దిగొచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Delhi High Court
Jagadish Sharma
Petition
Assembly Elections
Five States
Corona Virus
Omicron

More Telugu News