K Narayana Swamy: లక్షల్లో జీతాలు తీసుకుంటూ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు: ప్రభుత్వ టీచర్లపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్
- ఏపీలో ఉద్యోగుల ఉద్యమం
- ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలన్న నారాయణస్వామి
- ఉపాధ్యాయుల తీరుపై అసంతృప్తి
- సీఎం పట్ల టీచర్ల భాష సరిగా లేదని అభ్యంతరం
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను అంగీకరించేది లేదంటూ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు గౌరవించాలని హితవు పలికారు. ముఖ్యంగా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు చెడుగా మాట్లాడితే ఎలా? అని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. సీఎం పట్ల ఉపాధ్యాయులు మాట్లాడుతున్న తీరు సరిగాలేదని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతున్నారా? అని నిలదీశారు. ఓపక్క రూ.70 వేలు, లక్ష రూపాయల జీతాలు తీసుకుంటూ, మరోపక్క మీ పిల్లల్ని ప్రైవేటు బడుల్లో చదివిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. మీరు పాఠాలు చెప్పే ప్రభుత్వ స్కూళ్లలోనే మీ పిల్లలను చదివించవచ్చు కదా! అని నిలదీశారు.