India: డబ్ల్యూహెచ్ఓ వెబ్ సైట్ లో జమ్మూ కశ్మీర్ ను విడిగా చూపించడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం
- కొవిడ్ వెబ్ సైట్లో జమ్మూ కశ్మీర్ కు వేరే రంగులు
- ప్రధానికి లేఖ రాసిన టీఎంసీ ఎంపీ
- రాజ్యసభలో ప్రశ్నించిన కేంద్రమంత్రి సింథియా
- లిఖితపూర్వక వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన కొవిడ్ వెబ్ సైట్లో భారత్ చిత్రపటాన్ని తప్పుగా చూపించిందంటూ కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ అంశం నేడు రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఓ ప్రశ్నకు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
డబ్ల్యూహెచ్ఓ వెబ్ సైట్లో భారత మ్యాప్ అగ్రభాగాన ఉండే జమ్మూ కశ్మీర్, లడఖ్ భూభాగాలను విడిగా చూపించడం పట్ల కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ ను వేరే రంగులో సూచించడం తగదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డబ్ల్యూహెచ్ఓకి స్పష్టం చేసింది.
ఈ అంశాన్ని మొదట గుర్తించిన టీఎంసీ ఎంపీ శంతను సేన్ దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రాజ్యసభలో ప్రశ్నించారు. విదేశాంగ శాఖ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుందని సింథియా అడిగారు. అందుకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ సభాముఖంగా వివరణ ఇచ్చారు.
జమ్మూ కశ్మీర్ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరించడంపై డబ్ల్యూహెచ్ఓను అత్యున్నతస్థాయి మార్గాల ద్వారా వివరణ కోరామని, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని వెల్లడించారు. అయితే, దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఐరాసలోని భారత శాశ్వత మిషన్ వర్గాలకు సమాచారం అందించిందని మురళీధరన్ వెల్లడించారు. ఆ మ్యాప్ కు సంబంధించి వెబ్ సైట్లోనే డిస్ క్లెయిమర్ ప్రకటనను కూడా పొందుపరిచిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు.
"ఏదైనా దేశం, ప్రాంతం, భూభాగం, వాటిపై అధికారాలు, చట్టబద్ధమైన స్థితి పట్ల డబ్ల్యూహెచ్ఓ ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలేదని ఆ డిస్ క్లెయిమర్ లో పేర్కొన్నారు. మ్యాప్ పై ఉన్న చుక్కలు, గీతలు కేవలం రేఖామాత్రంగానే సరిహద్దులను సూచిస్తాయని తెలిపారు. వీటికి పూర్తిస్థాయిలో ఒప్పందం కుదిరి ఉండకపోవచ్చు అని వివరించారు" అని మురళీధరన్ వెల్లడించారు. అయితే, ఆయా ప్రాంతాల సరిహద్దులపై నిర్ణయం తీసుకునే హోదా మాత్రం భారత ప్రభుత్వానిదేనని నిస్సందేహంగా పునరుద్ఘాటితమైంది అని ఆయన స్పష్టం చేశారు.