Sudheer Babu: డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఉపాధ్యాయ సంఘం నేతలు
- ఉపాధ్యాయులపై ధ్వజమెత్తిన నారాయణస్వామి
- సీఎంపై వ్యాఖ్యలు తగదని హితవు
- టీచర్ల పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారని వ్యాఖ్య
- మీ పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారన్న ఉపాధ్యాయ నేతలు
ఏపీ సీఎం జగన్ ను ఉపాధ్యాయులు నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదని, లక్షల జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల పట్ల ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాప్టో చైర్మన్ సుధీర్ బాబు మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లల్లో సగం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని వెల్లడించారు. మరి డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు? అంటూ నిలదీశారు. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక మంత్రులు డ్రామాలు ఆడుతున్నారని సుధీర్ బాబు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి బాధ్యతగా మెలగాలని హితవు పలికారు.
మంత్రి వ్యాఖ్యలపై ఫ్యాప్టో ప్రతినిధి హృదయరాజ్ కూడా స్పందించారు. తాము పీఆర్సీ గురించి పోరాడుతుంటే మంత్రి నారాయణస్వామి మరో అంశం గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు లేని వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకురాగలదా? అని ప్రశ్నించారు.