Eden Gardens: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. భారత్-విండీస్ టీ20 సిరీస్‌కు ప్రేక్షకులకు అనుమతి
- 75 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
- 50 వేల మంది ప్రేక్షకులతో కళకళలాడనున్న స్టేడియాలు
- టీ20 సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం
క్రికెట్ ప్రేమికులు స్టేడియాల్లో మ్యాచ్‌లు చూసి ఎన్నాళ్లయిందో! కరోనా ఈ ప్రపంచంపై దండెత్తడానికి ముందు ప్రేక్షకులతో స్టేడియాలు కిటకిటలాడేవి. కరోనా దాడి తర్వాత స్టేడియాలన్నీ బోసిపోయి దర్శనమిస్తున్నాయి. అభిమానుల కేరింతలు లేకుండా మ్యాచ్‌లు నిశ్శబ్దంగా, చప్పగా సాగుతున్నాయి. అయితే, ఈ నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో అభిమానులకు ఆ కొరత తీరనుంది.
విండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం సామర్థ్యంలో 75 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ఈడెన్ గార్డెన్స్ అధికారులు నిర్ణయించారు. ఇండోర్, అవుట్డోర్ క్రీడలను 75 శాతం సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా నిర్ణయంతో టీ20 మ్యాచ్‌లకు దాదాపు 50 వేల మంది ప్రేక్షకులను అనుమతిస్తారు. వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 సిరీస్ 16 నుంచి ప్రారంభం అవుతుంది. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని కరీబియన్ జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధమైన రోహిత్‌శర్మ సేన ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుని బయోబబుల్‌లోకి ప్రవేశించింది.